దానంపై వేటు

19-09-2026 | 05:40am

ఎమ్మెల్యేగా అనర్హత.. ఖైరతాబాద్ సీటు ఖాళీ

  1.    2024 ఏప్రిల్ 23 నుంచి అమలు
  2. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయానికి ఎదురుదెబ్బ
  3.    2023లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్
  4.    2024 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ
  5. వేటు వేయాలని గతంలో స్పీకర్‌ను ఆశ్రయించిన బీఆర్‌ఎస్, బీజేపీ
  6. విచారించి క్లీన్‌చిట్ ఇచ్చిన శాసనసభాపతి
  7. సవాల్ చేస్తూ హైకోర్టుకెళ్లిన ప్రతిపక్షాలు
  8. వేటువేస్తూ సీజే ధర్మాసనం జడ్జిమెంట్

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender)పై అనర్హత వేటు పడింది. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడం చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు(State High Court sensational verdict) వెలువరించింది. 2024 ఏప్రిల్ 23 నుంచే అనర్హత అమలులోకి వచ్చినట్లు పరిగణించాలని తేల్చిచెప్పింది. ఖైరతాబాద్ సీటు(Khairatabad seat) ఖాళీ అయిందంటూ ఇటు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి, అటు ఎన్నికల సం ఘానికి సమాచారం ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీఫామ్‌తో పోటీ చేసి గెలిచిన దానం.. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Election)ల్లో కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ ఎంపీ(Secunderabad mp)గా పోటీ చేసి ఓడిపోయారు.

దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లు స్పష్టమైన ఆధారాలను తాము సమర్పించినప్పటికీ వాటిని అసెంబ్లీ స్పీకర్  పరిగణనలోకి తీసుకోకుండా క్లీన్‌చిట్ ఇచ్చారంటూ ఆ మధ్య హైకో ర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొయినుద్దీన్ ధర్మా సనం ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసింది. శుక్రవారం జడ్జిమెంట్‌ను వెలువరించింది. ఎంపీగా పోటీ చేసిన 2024 ఏప్రిల్ 23 నుంచే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని కోల్పోయారని, అప్పటి నుంచే డిస్‌క్వాలిఫై అయినట్లు గుర్తించాల్సి ఉంటుందని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 

స్పీకర్ నిర్ణయానికి బ్రేక్..

బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిపై వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు గతంలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పిటిషన్లు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ  వెళ్లింది. దశల వారీగా విచారణ జరిపిన స్పీకర్ ట్రిబ్యునల్.. పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ క్లీన్ చీట్ ఇచ్చింది. దానం నాగేందర్ విషయంలోనూ ఇదే విషయం తేల్చిచెప్తూ ఈ ఏడాది మార్చి 11న తీర్పు వెలువరించింది.

బీఆర్‌ఎస్, బీజేపీ నేతల  అభ్యర్థనలను కొట్టివేసింది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితోపాటు బీజేపీ ఎల్పీ నేత  ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విడివిడిగా హైకోర్టును ఆశ్రయించారు. వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయని, వాటిని స్పీకర్‌కు అందజేసినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు వెలువరించారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

2023 డిసెంబర్‌లో ఖైరాతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫు పోటీ చేసి ఎమ్మెల్యేగా దానం గెలిచారని, ఆ తర్వాత 2024 మార్చిలో కాంగ్రెస్‌లో చేరారని, 2024 ఏప్రిల్‌లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌పై ఎంపీగా పోటీ చేశారని ప్రస్తావించారు. వీటిని విచారించిన సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ బెంచ్.. స్పీకర్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆ ట్రిబ్యునల్ తీర్పును నిలిపివేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 (2), సంబంధిత చట్టంలోని పేరా 211ఏ ప్రకారం 2024 ఏప్రిల్ 23 నుంచి శాసనసభ సభ్యత్వానికి దానం నాగేందర్ అనర్హుడని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

కాగా, ఈ ఆర్డర్‌పై స్టే విధించాలంటూ దానం నాగేందర్ తరఫున అడ్వకేట్లు అభ్యర్థించారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేగా తొలగిస్తే నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉత్వర్వులు కొంతకాలం అమలులోకి రాకుండా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వారి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. 

ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి?

దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. 2024లో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లారని, వారందరిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు గతంలోనే బీఆర్‌ఎస్ పిటిషన్లు సమర్పించింది. అయితే స్పీకర్ ఒక్కొక్క కేసును విచారించి పిటిషన్లను కొట్టివేశారు.

తాజాగా దానం నాగేందర్ కేసులో స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు రద్దుచేయడంతో మిగతా ఎమ్మెల్యేల కేసులపై ఆసక్తి పెరిగింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, అరెకెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి ఉన్నట్లు బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. 

మరిన్ని వార్తలు