5 September, 2026 | 1:23 AM

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం

04-09-2026 | 11:27pm

మంచిర్యాల,(విజయక్రాంతి): విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం – 2026కు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్య సాధనలో మంచిర్యాల జిల్లా(Mancherial District) విశిష్ట ప్రతిభ కనబరిచింది. 2025–26లో 43 వేల 72 మంది విద్యార్థులు ఉండగా, 2026–27లో ఈ సంఖ్య 45 వేల 626కు పెరిగి 2 వేల 554 మంది అదనంగా చేరారు.

2024–25తో పోలిస్తే రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 10.34 శాతం పెరిగింది. జిల్లాలోని 282 ప్రభుత్వ పాఠశాలలలో 10 శాతానికి పైగా అదనపు నమోదు సాధించగా, మందమర్రి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, భీమారం మండలాలలో 10 శాతానికి పైగా నమోదు పెరిగింది. అలాగే 2026–27లో 4 వేల 346 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలలలో చేరడం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.

జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి పి.చంద్రయ్య(District Education Officer P. Chandraiah), విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఐ ఎస్, సి సి ఓ లు, సి ఆర్ పి ల సమన్వయంతో చేపట్టిన కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ, సమష్టి కృషి ఈ విజయానికి దోహదపడింది. ఈ నెల 5న కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ పురస్కారం మంచిర్యాల జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖతో పాటు మంచిర్యాల జిల్లాకు రాష్ట్రస్థాయిలో లభించిన విశిష్ట గుర్తింపు.

మరిన్ని వార్తలు