చెట్టెక్కించి చిత్రహింసలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): చేతబడి నెపంతో వృద్ధురాలిని తాళ్లతో కొట్టి, చెట్టెక్కించి కింద మేకులు కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో(Social media) వైరల్ కావడంతో బూర్గంపాడు పోలీసులు(Burgampadu Police) సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన జూలైలో జింకలగూడెం గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్‌కే షకీనా బీ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె బంధువులు మూఢనమ్మకంతో ఆమెపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. తాళ్లతో కొట్టి, చెట్టెక్కించి, చెట్టు కింద మేకులు కొట్టిన దృశ్యాలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చాయి. ఘటనకు కారకులుగా షేక్ మదర్, షేక్ ఫయాజ్, కరీముల్లా, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూఢనమ్మకాల పేరుతో హింసిస్తే కఠిన చర్యలు
మూఢనమ్మకాలు(Superstitions), చేతబడి పేరుతో ఎవరినైనా హింసించినా, దుర్భాషలాడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్‌కుమార్ హెచ్చరించారు.