ఆర్టీసీలో ఎన్నికల నగారా

19-09-2026 | 05:10am

అక్టోబర్ 9న పోలింగ్

17న ఫలితాలు ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Telangana State Road Transport Corporation)(టీజీఎస్ ఆర్టీసీ)లో గుర్తింపు యూనియన్ ఎన్నికల(Recognition Union Election) నగారా మోగింది. సీక్రెట్ బ్యాలెట్ విధానం(Secret ballot system)లో అత్యధిక మెజారిటీ సాధించిన యూనియన్‌కు గుర్తింపు కల్పించేందుకు ఎన్నికల షెడ్యూల్‌(Election Schedule)ను రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ (జంట నగరాల) జాయింట్ లేబర్ కమిషనర్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 9న పోలింగ్ జరగనుంది. 17న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.

ఇక సెప్టెంబర్ 21న పోటీ చేయాలనుకునే యూనియన్లు తమ సమ్మతి పత్రాలను (విల్లింగ్‌నెస్) సమర్పించాల్సి ఉంటుంది. 22న డిపో మేనేజర్లు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలను(Voter List) సంబంధిత జిల్లాల డిప్యూటీ రిటర్నింగ్ అధికారులకు (డీసీఎల్) అందజేస్తారు. ఈ జాబితాలపై యూనియన్ల నుంచి సెప్టెంబర్ 24వరకు అభ్యంతరాలు స్వీకరించారు. 25న డిపో మేనేజర్లు, యూనిట్ అధికారులతో అభ్యంతరాలపై చర్చించి ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేస్తారు. సెప్టెంబర్ 26న తుది ఓటర్ల జాబితా ప్రకటించడంతో పాటు యూనియన్లకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు.

జిల్లాల డీసీఎల్‌లు తుది ఓటర్ల జాబితాలను ప్రధాన రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. సెప్టెంబర్ 29న పోటీలో ఉన్న యూనియన్లు డీసీఎల్ వద్ద నుంచి నమూనా బ్యాలెట్ పత్రాలను (డమ్మీ బ్యాలెట్ పేపర్లు) తీసుకోవచ్చు. అక్టోబర్ 9న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహిస్తారు. అక్టోబర్ 17న ఓట్లు లెక్కించి.. ఫలితాలను వెల్లడిస్తారు. 

ప్రధాన యూనియన్లకు నోటీసులు..

ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న టీజీఎస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్, కార్మిక సంఘ్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ తదితర ప్రధాన కార్మిక సంఘాలకు రిటర్నింగ్ అధికారి ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని యూనియన్లు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి తెలంగాణ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్టోబర్ 9న జరిగే పోలింగ్, అనంతరం అక్టోబర్ 17న వెలువడే ఫలితాలపై ఆర్టీసీ కార్మిక సంఘాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు