టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలి

21-09-2026 | 04:54pm

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జిల్లాను క్షయ వ్యాధి(TB) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉచిత పరీక్షలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ పి. అశోక్ కుమార్(Additional Collector (Revenue) Ashok Kumar) కోరారు. సోమవారం ఐడీఓసీలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు, వైద్య సేవలపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, తెమడలో రక్తం, ఛాతీ నొప్పి, ఆయాసం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. సమీప ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లో ఉచితంగా ఎక్స్‌రే, తెమడ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు, చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.

గని కార్మికులు, మురికివాడల ప్రజలు, మధుమేహం, హెచ్‌ఐవీ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మొబైల్ ఎక్స్‌రే వాహనాలతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగి ఒక టీబీ బాధితుడిని దత్తత తీసుకుని చికిత్స పూర్తయ్యేలా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, డీఎంహెచ్‌ఓ డా. మధుసూదన్, ఆర్డీఓ హరికృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు