18 April, 2026 | 11:14 AM

అనుభవాలు

12-05-2025 12:00 AM

ఏదైనా సరే

అనుభవంలోకి రానిదే

మన కళ్ళు తెరచుకోవు!

పరిమళం 

చుట్టు ముట్టందే

పూలవైపు దృష్టి సారించము!

సాంగత్య ఫలితాలు 

అనుభవించందే

స్నేహాల విలువ గుర్తుకు రాదు!

గొంతు పొలమారినప్పుడైనా

రైతూ పొలమూ చెమటా

గుర్తుకు రాకపోతే మనుషులం కానట్లే!

వ్యాపారాలు ధనార్జనకే

వ్యవసాయం అట్లా కాదు

సకల జనుల సౌభాగ్యానికి!

ద్వేషాలు యుద్ధాలు 

ఉన్మాద ప్రేరకాలు

కలిసి పాడే పాటే సూర్యోదయం!

ఏముంటది కాలం కరిగిపోయాక

నింగీ నేల మధ్య మనం

నడయాడిన గుర్తులు తప్ప!

కరచాలనాలు

కౌగిలింతలు వ్యాప్తి చేసిన వారు

చరిత్రలో తరతరాలు పలకరిస్తుంటారు!!

 కోట్ల వెంకటేశ్వర రెడ్డి