ఊపిరులున్నంత వరకు
పల్లె
వీరతిలకం దిద్దుతున్నది
బొడ్రాయి బొట్టుపెట్టి దీవెనలిస్తున్నది
గుండెను హత్తుకొని
నుదుట ముద్దిచ్చి
ఆనందభాష్పాలతో
సరిహద్దులకు సైనికులకు పంపుతున్నది
బిడ్డలు
కుంకుమపూలు
సిందూర పూలు
ఎర్రచందనపు పూలు
యుద్ధం చెయ్యడానికి
వీరులకు వీరతిలకం దిద్ది
రణభూమికి సాగనంపుతున్నది
అమ్మా!
నీకీసారి కశ్మీరాన్నీ కానుకగా ఇస్తాను
కుంకుమపువ్వు తెచ్చి
మీ సిగలో అలంకరిస్తా
నన్ను ఆపకు
సిందూరం త్వరగా రమ్మని
కబురు పంపింది
ఉగ్రరూపంతో
ఈ దేశం నాదని
ఈ శరీరం భరతమాతదని
వీడ్కోలు పలుకుతున్నది
ఏళ్ల తరబడి
నెత్తుటికూడు తింటున్న దుండగులను
తుద ముట్టించెదాక
రెప్పవాల్చను
రెక్కన తుపాకి దించను
అగ్నివర్షం కురిపిస్తాను
మువ్వన్నెల పతాకాన్ని ఎగరేస్త
అమ్మా మీ మద్దతు
వేల శతఘ్నుల సమానం
మీ సానుభూతి
లక్ష మిస్సైళ్ల ధైర్యం
సుదర్శన చక్రాల్లా తిరుగుతూ
కవ్వించి కాలు దువ్వుతున్న
కర్కష మూకలను ఏరి పారేస్తాం
అమ్మీ!
మమ్ముకన్నందుకు
మీ పాదాలకు వందనం
మాతృభూమికి అభివందనం
ఈ దేశమే మా వస్త్రం
ఈ దేశమే మా దేహం
ఈ దేశమే మా గుండె
దేశమే మా సమరం!
ఊపిరులున్నంత వరకు!
(బిడ్డలను యుద్ధానికి పంపుతున్న పల్లెలకు దండాలు పెడుతూ..)
- వనపట్ల సుబ్బయ్య






