వైద్య ఆరోగ్యశాఖలో వసూల్ రాజాలు!
- ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ. లక్షల్లో వసూలు
- అధికారుల విచారణలో బహిర్గతం
- ఆఫీసులో 273 ఫైళ్లు మిస్సింగ్
- బదిలీ చేసిన చార్జి అప్పగించని వైనం
- యూనియన్ లీడర్లతో ఒత్తిడిలు
మేడ్చల్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical and Health Department)లో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడిన అంశం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిల వద్ద కిందిస్థాయి ఉద్యోగులు రూ. లక్షల్లో వసూలు చేసినట్లు విచారణలో తేలింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డిపార్ట్మెంట్లో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు.
సంబంధిత అధికారులను పక్కనపెట్టి పై అధికారుల అండదండలతో కిందిస్థాయి ఉద్యోగులు ఇద్దరూ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. జూనియర్ అసిస్టెంట్, డాటా ఆపరేటర్ పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని డీఎంహెచ్వో డాక్టర్ కే ఆనంద్ కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయన విచారణ కమిటీని నియమించారు. కీసర, మల్కాజిగిరి డిప్యూటీ డిఎంహెచ్వోలకు విచారణ బాధ్యత అప్పగించగా, అనేక అక్రమాలు బయటపడినట్లు తేలింది.
కార్యాలయంలో 273 ఫైళ్లు మిస్సింగ్
డీఎంహెచ్వో కార్యాలయంలో 273 ఫైళ్లు మిస్ అయినట్లు తెలిసింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ విభాగానికి 590 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు దారుల వద్ద లక్షల్లో వసూలు చేశారు. విచారణ అధికారులు దరఖాస్తుదారులను వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను దరఖాస్తుల వివరాలు అడగగా 273 ఫైల్ ఇవ్వడం లేదు.
వీరు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రోగ్రాం ఆఫీసర్, డిప్యూటీ డెమో ప్రైవేట్ ఆస్పత్రుల అనుమతికి ఇన్స్పెక్షన్ చేసి నివేదిక ఇవ్వాలి. కానీ ఉన్నతాధికారి అండదండలతో జూనియర్ అసిస్టెంట్, డాటా ఆపరేటర్ ఇన్స్పెక్షన్ చేసినట్లు తేలింది. సంబంధిత అధికారులు ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉండగా అర్హత లేని వారు ఇన్స్పెక్షన్ చేయడం గమనార్హం.
డీఎంహెచ్వో పై ఒత్తిడి
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి టీఎన్ జీవో అసోసియేషన్ లో లీడర్. దీనిని అడ్డం పెట్టుకొని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా అధ్యక్షుడు డి ఎం హెచ్ ఓ తో వాగ్వాదం చేసినట్లు తెలిసింది. ఒక దశలో బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు సమాచారం. అయినప్పటికీ డీఎంహెచ్వో వెనుకడుగు వేయలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని బదిలీ చేశారు. కాగా ఆ ఉద్యోగి చార్జి అప్పగించడానికి మొండికేశాడు. వాస్తవానికి సస్పెండ్ చేసి విచారణ చేయాలి. కానీ బదిలీతో సరిపెట్టారు. వీరికి ఒక ఏజెంట్ కూడా ఉన్నాడు. ఆయన కింద నలుగురు ఏజెంట్లు ఉన్నట్లు తెలిసింది.
శానిటేషన్ సర్టిఫికెట్లకు వసూళ్లు
శానిటేషన్ విభాగం ఉద్యోగులు శానిటేషన్ సర్టిఫికెట్లకు పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలో, షాపింగ్ మాల్స్ , సినిమా థియేటర్లకు శానిటేషన్ సర్టిఫికెట్ అవసరమవుతుంది. వీరి అవసరాన్ని ఆసరా చేసుకుని పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. గత్యంతరం లేక అడిగినంత డబ్బు చెల్లించి సానిటేషన్ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో జరుగుతున్న పరిణామాలు కలెక్టరేట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఉన్నతాధికారులు ఈ విషయమై స్పందించవలసిన అవసరం ఉంది.