రామప్పను సందర్శించిన సినీ నటుడు
వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం సినీ నటుడు మురళీధర్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, కాకతీయుల శిల్పకళ విశిష్టత, నిర్మాణ ప్రాధాన్యతలను టూరిజం గైడ్ వెంకటేష్ వివరించారు. ఈ సందర్భంగా మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలుగా రామప్ప దేవాలయాన్ని సందర్శించాలని అనుకుంటున్నానని, నేడు తన కోరిక నెరవేరిందన్నారు. రామప్ప ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించిన బోటింగ్ చేశారు. వారి వెంట ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్ కుమార్, భద్రు, శ్రీకాంత్, దేవాదాయ, పురావస్తు, టూరిజం శాఖల సిబ్బంది పాల్గొన్నారు.






