కందుకూరులో వైన్స్ దగ్ధం: రూ. 1.50 కోట్ల ఆస్తి నష్టం
కందుకూరు, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని జై భవాని వైన్స్‌లో(Jai Bhavani Wines) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వైన్స్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.50 కోట్ల విలువైన మద్యం, ఇతర సామగ్రి బూడిదైనట్లు సమాచారం. ఉదయం 7:00 నుంచి 7:30 గంటల మధ్యలో మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఉదయం 7:40 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ దుకాణం యజమాని నవీన్ కాగా, విజయ్, శరత్ అనే వ్యక్తులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా షాద్‌నగర్ వాసులుగా సమాచారం. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నారు.