సర్వసభ్య సమావేశానికి ఫ్లెక్సీ కరువు

11-09-2026 | 11:27pm

ప్రజలకు సమాచారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం

ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందలేదని విమర్శలు

అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో(Mandal Praja Parishad Office) శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి కనీసం ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సమావేశం విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అధికారులు ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సమావేశానికి సంబంధించిన అధికారిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోగా, కార్యాలయ ప్రాంగణంలో కేవలం ‘ప్రజావాణి’ ఫ్లెక్సీ(prajavani Flexi) మాత్రమే కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సర్వసభ్య సమావేశానికి ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు, ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందించాల్సి ఉన్నప్పటికీ, కనీసం ఆహ్వాన పత్రికలు కూడా అందలేదని పలువురు పేర్కొంటున్నారు.

సమాచారం ఇవ్వడంలోనే నిర్లక్ష్యమా?

సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారా? లేక ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమావేశానికి సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజా సమస్యలపై చర్చించే సమావేశం ఉద్దేశం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘ఫ్లెక్సీకి కూడా నిధులు లేవా?’

‘‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సమావేశం గురించి ప్రజలకు తెలియజేయడానికి కనీసం ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి కూడా నిధులు లేవా?’’ అంటూ స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ముందుగా సమావేశ సమాచారం ప్రజలకు చేరవేయడంలోనే విఫలమైతే,సమస్యల పరిష్కారం ఏ మేరకు జరుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, ఇటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు