అర్హులైన బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు

08-09-2026 | 09:45pm

ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ద్వారా 100 శాతం సబ్సిడీ

సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి

మంథని,(విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం ద్వారా అర్హులైన వెనుకబడిన తరగతుల (బీసీ) మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీతో అందించేందుకు చర్యలు చేపట్టినట్లు మంథని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, బీసీ అభివృద్ధి శాఖ చైర్మన్ కోయ శ్రీహర్ష, ఐఏఎస్ సెప్టెంబర్ 2, 2026న ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పేద, నిరుద్యోగ, అర్హత కలిగిన బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం, ఆర్థిక స్వావలంబన పెంపొందించడం, ఆదాయ అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి

అర్హత కలిగిన మహిళలు సెప్టెంబర్ 15, 2026లోపు టీజీఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, అనంతరం మంథని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని కమిషనర్ కోరారు. 

అర్హతలు ఇవే...

దరఖాస్తుదారు బీసీ వర్గానికి చెందిన మహిళ అయి ఉండాలి. వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబానికి ఒక్క కుట్టు మిషన్ యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు.

దరఖాస్తుతో పాటు తెల్ల రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, టైలరింగ్ నైపుణ్య ధ్రువీకరణ వంటి పత్రాలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు