చెన్నూరు అభివృద్ధే నా లక్ష్యం
- ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా ధ్వేయం..!
- మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గం(Chennur Constituency) అభివృద్ధే నా లక్ష్యమని, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా ధ్వేయమని రాష్ట్ర మంత్రి, చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkata Swamy) అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చెన్నూర్ నియోజక వర్గంలో అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రోడ్డు విస్తరణ, రూ. 30 కోట్లతో మంచినీటి పనులు, విద్యాసంస్థల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, ఆలయ అభివృద్ధి, టూరిజం సహా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
పుష్కరాల నేపథ్యంలో సుమారు రూ.70 కోట్లతో అభివృద్ధి పనులకు(development work) ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. జోడువాగుల వద్ద రూ. 100 కోట్ల పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. వంద పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 23 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చారన్నారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలకు మా సమాధానం ఒక్కటే అభివృద్ధి అని అన్నారు. ప్రజల సహకారంతో చెన్నూరును మోడల్ పట్టణంగా, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.






