19 August, 2026 | 3:38 PM

సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు

19-08-2026 03:00 PM

రేవంత్, పొంగులేటికి రియల్ ఎస్టేట్ తెలిస్తే.. బీఆర్ఎస్ కు పోరాటాలు తెలుసు

సీఎంకు తెలియకుండా 22A జరగదు.. హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు 

30 ఏళ్లుగా లేని నిబంధనలు ఇప్పుడెందుకు

బకరాలకు భూములు అమ్ముడే కాంగ్రెస్ నేతల పని

ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం

హైదరాబాద్: ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హామీ ఇచ్చారు. 30, 40 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తోందన్నారు. ఏళ్లుగా లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు పెట్టారు? అని ప్రశ్నించారు. 22ఏ బాధితులకు అండగా ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటికి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే.. బీఆర్ఎస్ నేతలకు పోరాటాలు తెలుసని హరీశ్ రావు స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరిస్తారా?.. ప్రజల కాళ్ల కింద నలిగిపోతారా? అని ప్రశ్నించారు. 

ఒక్క ఎకరా కూడా 22ఏ లో పెట్టలేదని 10 రోజుల క్రితం పొంగులేటి చెప్పారు. ఇప్పుడు అధికారులు తప్పు చేశారని అంటున్నారని ఆరోపించారు. నిషేధిత జాబితా గురించి 4 నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని మంత్రి కోమటి రెడ్డి చెప్పారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పినప్పుడే సీఎం రేవంత్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటికి తెలిసే జరిగిందని స్పష్టంగా అర్థం అవుతోందని పేర్కొన్నారు. కోట్లాది ఆస్తులను పనంగాపెట్టే ధైర్యం అధికారులకు ఉంటుందా?, చీటికి మాటికి విచారణలు చేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు స్పందించడం లేదు? ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలో నిషేధిత జాబితాలో 40 వేల ఎకరాలు ఉన్నాయని తెలిపారు.

మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 22ఏలో ఏయే భూములు పెట్టారో వాటిని తొలగిస్తే సరిపోతుందన్నారు. నిషేధిత జాబితాలో పెట్టిన భూములను తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు.. ఇప్పుడు ప్రజల భూములపై పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాల్లో కొని గజాల్లో బకరాలకు భూములు అమ్మడమే కాంగ్రెస్ నేతల పని అన్నారు.  ప్రభుత్వం స్పందించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.