డీజే శబ్దాలు.. చెక్ పడినట్టేనా..!

13-09-2026 | 05:30pm

దమ్మపేట,సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): వినాయక చవితి ఉత్సవాల్లో,నిమజ్జన ఊరేగింపుల్లో మితిమీరిన శబ్దంతో డీజేలు (DJ sound systems)వాడటం వల్ల అనేక అనర్థాలు, సమస్యలు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.డీజేల వల్ల వచ్చే విపరీతమైన బాస్(Bass), వైబ్రేషన్లు వృద్ధులు,గుండెజబ్బులు,యితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.డీజేల వల్ల హఠాత్తుగా గుండె కొట్టుకునే వేగం పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా 80 డెసిబుల్స్‌కు మించిన శబ్దం నిరంతరం వింటే వినికిడి శక్తి దెబ్బతింటుందని, డీజే సౌండ్‌ బాక్సులు 100 నుండి 130 డెసిబుల్స్‌కు పైగా శబ్దం చేస్తాయని, ఇది తాత్కాలిక లేదా శాశ్వత చెవుడుకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నిరంతర భారీ శబ్దాల వల్ల తీవ్రమైన తలనొప్పి, చిరాకు,బీపీ పెరగడం, తీవ్రమైన నిద్రలేమి సమస్యలు వస్తాయనీ చెబుతున్నారు. భక్తిభావంతో జరుపుకోవాల్సిన పండుగలో అసభ్యకరమైన సినిమా పాటలు, శృతిమించిన డ్యాన్సులు, మద్యం మత్తులో ఘర్షణలు జరగడం వల్ల పండుగ పవిత్రత దెబ్బతింటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వినాయక చవితి నిమజ్జనాల్లో ఈ డీజే ల సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుందని, ముఖ్యంగా నాలుగు దారుల కూడళ్లలో నాలుగైదు ఊరేగింపు విగ్రహాలు ఒకే చోట చేరి వారు చేసే విపరీత డీజే శబ్దాలకు ప్రజలు ఇప్పటినుండే ఆందోళన చెందుతున్నారు. డీజేల వాడకాన్ని తగ్గించి, సంప్రదాయ మేళతాళాలు, కోలాటం, పరిమిత ధ్వని గల మైకులతో ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఈ వినాయక చవితి ఉత్సవాల్లో డీజే ల పర్మిషన్ లపై ఎస్ ఐ బి రాజేష్ కుమార్ ను వివరణ కోరగా డీజే లకు ఎటువంటి పర్మిషన్ లు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డీజే లు నిర్వహిస్తే వాటిని సీజ్ చేసి నిర్వాహుకులపై చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు