మంజీరా తీరాన భక్తి వెల్లువ..

04-10-2026 | 06:47pm

* వనదుర్గమ్మను దర్శించుకున్న వందలాది భక్తులు

* భక్తజన సంద్రంగా ఏడుపాయలు..

* అమ్మ నామస్మరణతో మార్మోగిన క్షేత్రం

* మంజీరాలో పుణ్యస్నానాలు.. బోనాలు, ఓడిబియ్యం సమర్పణ

పాపన్నపేట,అక్టోబర్04: ఒకవైపు మంజీరా జలాల(Manjira waters) సవ్వడి.. మరోవైపు “వనదుర్గమ్మ తల్లి.. చల్లగా చూడమ్మా” అంటూ భక్తుల నామస్మరణ.. ఇలా ఏడుపాయల క్షేత్రం(Etupayala Shrine) ఆదివారం భక్తి పారవశ్యంలో పులకించింది. వారాంతపు సెలవు రోజు కావడంతో జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, హైదరాబాద్‌(Hyderabad) జంట నగరాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో ఏడుపాయలు జనసంద్రమైంది. ఎటుచూసినా భక్తుల సందడే కనిపించగా.. అమ్మవారి దర్శనం, పుణ్యస్నానాలు, మొక్కుల సమర్పణతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

వేకువజామునే ఆలయ అర్చకులు వనదుర్గమ్మకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని సుందరంగాఅలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయం సమీపంలోని మంజీరా నదీపాయ, చెక్‌డ్యామ్‌ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.

మొక్కులు తీర్చుకునేందుకు పలువురు భక్తులు బోనాలు, ఓడిబియ్యం సమర్పించగా.. మరికొందరు తలనీలాలు సమర్పించి అమ్మవారిని వేడుకున్నారు. డప్పు చప్పుళ్లు, జయజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో మునిగిపోయారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు