ఇసుక అక్రమాల ఆన్‌లైన్ నిలిపివేయాలి

01-10-2026 | 03:14pm

తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెం కోటి డిమాండ్

మణుగూరు, అక్టోబర్ 1, (విజయ క్రాంతి ): మణుగూరు మండల పరిధిలో జరుగుతున్న ఇసుక అక్రమాలను(Illegal Sand Mining) అరికట్టేందుకు ఇసుక ఆన్‌లైన్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెం కోటి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మగూడెం, బాపనకుంట, శివాజీనగర్ తదితర గ్రామాల పరిధిలో ఇసుక సొసైటీల పేరుతో అక్రమ ఇసుక తరలింపు జరుగుతోందని ఆరోపించారు.

మైదాన ప్రాంతాలకు చెందినవారు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన గిరిజనేతరులు ఇసుక దందాను నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పేర్కొన్నారు.1/70 చట్టం, అసైన్మెంట్ చట్టం, P.O.T. చట్టంలోని నిబంధనలు, నాలా కన్వర్షన్ నిబంధనలు పాటించకుండా ఇసుక డంపింగ్ చేస్తున్నారని, వాల్టా చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతోందని అన్నారు.

ఈ అక్రమాల వెనుక అధికార పార్టీకి చెందిన వ్యక్తులు, కొంతమంది ప్రభుత్వ అధికారులు ఉన్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి ఇసుక అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలని కోరారు.ఆదివాసీల సహజ వనరులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అలెం కోటి డిమాండ్ చేశారు. ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే అక్టోబర్ 2 నుంచి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు