బిగ్‌బాస్ లోకి
సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, కష్టాలను మెట్లుగా మలచుకుంటూ, తన మధురమైన గళంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న మట్టి పరిమళం, అచ్చమైన రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ. ఏ రంగంలోనైనా అంకితభావం, పట్టుదల ఉంటే ఎంతటి శిఖరాలకైనా చేరుకోవచ్చని నిరూపించిన ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
సూర్యాపేట జిల్లా(Suryapet District) చివ్వెంల మండలంలోని మారుమూల కోమటికుంట గ్రామానికి చెందిన సాధారణ రైతు(Ordinary farmer) గుండెబోయిన సైదులు(Gundeboyina Saidulu) దంపతులకు జన్మించిన ఝాన్సీ(Jhansi) బాల్యం కష్టాల నడుమ సాగింది. తల్లిదండ్రులు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తుండటంతో, ఆమె చిన్నతనం నుంచే పొలం పనులను(Farm work), శ్రమ విలువను దగ్గరుండి చూసింది. కష్టపడే తత్వమే ఆమెకు పెద్దయ్యాక ఎదురయ్యే ప్రతి సవాల్‌ను ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చింది.
చదువు సాగిందిలా..
ఒకవైపు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూనే, మరోవైపు తన చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ఝాన్సీ. స్థానిక గవర్నమెంట్ పాఠశాల(Government school)ల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పూర్తి చేసుకుని, ఇంటర్, డిగ్రీ సూర్యాపేటలో పూర్తి చేసి నల్లగొండ(Nalgonda) మహాత్మ గాంధీ యూనివర్సిటీ(Mahatma Gandhi University)లో ఆర్గానిక్ కెమిస్ట్రీ(Organic Chemistry)లో పీజీ చదివింది. ఉన్నత చదువుల దశలో అనేక ఆర్థిక, సామాజిక(Economic, social) ఇబ్బందులను ఎదుర్కొన్నది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా, తన లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగింది.
గళమే ఆమె బలం
చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఉన్న మక్కువతో ఆమె తన గళాన్ని మెరుగుపరుచుకున్నారు. అనేక వేదికలపై తన ప్రతిభను నిరూపించుకునే క్రమంలో ఆమె జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి. విమర్శలను, ఆటంకాలను ఎదుర్కొంటూ పాటను తన ప్రాణంగా భావించి ముందుకు సాగిన ఆమె.. తన ప్రతిభతో సంగీత లోకంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ఆ కఠిన పరీక్షలన్నింటినీ దాటి ఆమె సాధించిన విజయమే ఆమెను నేడు ఈ స్థాయికి చేర్చింది.
రైతు బిడ్డగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి
దేశంలోనే పేరుగాంచిన రియాల్టీ షో(Reality show) బిగ్‌బాస్ ప్రోగ్రాం(Bigg Boss show) ఎంపికలో వేల మంది పోటీదారులను వెనక్కి నెట్టి 16 మంది సభ్యులలో మూడో స్థానంలో నిలిచి సంచలనం సృష్టించిన రైతు బిడ్డ ఝాన్సీ. గ్రామీణ నేపథ్యంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయ పనులు చేస్తూ.. బురద మడిలో వరినాట్లు వేస్తూ.. తన గళంతోనే కష్టజీవుల కష్టాన్ని మైమరపింపజేసిన ఝాన్సీ.. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల ముందుకు వచ్చి, తన మంచితనంతో, ఆట తీరుతో అందరి మనసులను గెలుచుకుంటున్నది.
అన్నీ మరిచి ఎదురుచూస్తూ
పొలంలో నాట్లు వేసే సమయంలో, కష్టపడే శ్రమను మరిపించే అద్భుతమైన గళం ఝాన్సీ సొంతం. తెల్లారితే చాలు.. పొలాల్లో నాటు వేయడానికి వచ్చే తోటి కూలీలు, గ్రామ ప్రజలు ఆమె పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. వ్యవసాయ పనుల ఒత్తిడిని, అలసటను చిటికెలో మాయం చేసేలా ఆమె పాడుతుంటే, ఆ పాటల జోరుకి పొలమంతా ఉత్సాహంగా మారిపోయేది. ‘పనిలో కష్టం తెలియకుండా పాటలతో అలరించే మా ఝాన్సీ బిడ్డ నేడు ఏకంగా బిగ్ బాస్ ప్రోగ్రాంలో పోటీదారుగా నిలిచి టీవీల లో కనిపిస్తుందని సంభ్రంగా చెప్పుకుంటూ ఆ ప్రోగ్రాం ప్రసారం అయ్యేటప్పుడు టీవీలకు అతుక్కుని సంతోషంగా తిలకిస్తున్నారు.
శిలివేరి అనిల్ కుమార్
(సూర్యాపేట రూరల్, విజయక్రాంతి)