తెలంగాణకు మరణశాసనం రాసిందే కేసీఆర్
- రాజకీయ లబ్ధికోసమే కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్ రాద్ధాంతం
- మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : కృష్ణా జలాల(Krishna waters) విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆరేనని(KCR) మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) ఆరోపించారు. జూరాలలో నీటి మట్టం, నిల్వ సామర్థ్యంపై హరీశ్‌రావు(Harish Rao), కేటీఆర్(KTR), బీఆర్‌ఎస్ నాయకులకు అవగాహన లేదని విమర్శించారు. వచ్చే కాలంలో తాగునీరు ఎలా ఇవ్వాలన్న దానిపై మాట్లాడటం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కూడా జూరాల నీటిని తాగునీటి కోసం నిల్వ ఉంచితే.. తాము రాజకీయం చేయలేదని అన్నారు. రైతులు సమన్వయం పాటించాలని చేతులు జోడించి అడిగితే తన మాటలను బీఆర్‌ఎస్ నాయకులు వక్రీకరించారని అన్నారు.
రైతులకు ద్రోహం చేసినందుకే గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు(BRS) ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి(Farmers Welfare) కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. పాలమూరు జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. కుర్చీ వేసుకుని కూర్చొని పాలమూరు కడతానని కేసీఆర్.. నోరు తెరిస్తే అబద్ధాలేనన్నారు. ఎల్ నినోను ఎదుర్కోవడంపై బీఆర్‌ఎస్ సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప రాజకీయం చేస్తే తగినశాస్తి జరుగుతుందని మంత్రి శ్రీహరి హెచ్చరించారు.
కర్ణాటకతో సీఎం మాట్లాడారు: మంత్రి జూపల్లి
జూరాలకు నీటి కోసం కర్ణాటక ముఖ్యమంత్రితో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇప్పటికే మాట్లాడారని, 20వ తేదీనే కర్ణాటక సీఎంకు లేఖ రాశారని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తెలిపారు. జూరాలలో ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వమే కారణమన్నారు. జూరాలలో 2.5 టీఎంసీలు సిల్ట్ ఉంది. మరో మూడు టీఎంసీలు డెడ్ స్టోరేజ్. మరో 2.5 టీఎంసీలు తాగునీటి కోసం కేటాయించినవని, 1 టీఎంసీ ఆవిరిగా మారుతుందని తెలిపారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు కట్టిన కేసీఆర్.. 5.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న జూరాల కోసం అదనంగా ఎందుకు రిజర్వాయర్లు కట్టలేదన్నారు.
7 టీఎంసీలతో ౬ లక్షల ఎకరాల సాగు ఎలా అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కృష్ణా జలాల్లో వాడుకున్న అత్యధిక వాటా 33 శాతమేనని, ఆంధ్రప్రదేశ్ 77 శాతం వాడుకుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ దాదాపు 45 శాతం వాటా వాడుకుంటోందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీశ్‌రావు సంతకం చేస్తే.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కృష్ణా జలాల్లో 69 శాతం కోసం న్యాయపోరాటం చేస్తున్నారని తెలిపారు.