ఆదివాసీ సంస్కృతి ఎంతో గొప్పది
ప్రత్యేకమైనది
మరగొళ్ల పోటీలను ప్రారంభించిన ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో రాజేశ్వర్‌రావు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదివాసీ సంస్కృతి(Aboriginal culture) ఎంతో గొప్పదని, ప్రత్యేకమైనదని ఐటీడీఏ ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి రాజేశ్వర్‌రావు(ITDA In-charge PO Rajeshwar Rao) అన్నారు. గురువారం పొలాల అమావాస్య పండుగను పురస్కరించుకుని ఉట్నూర్‌లోని ఐటీడీఏ ప్రాంగణంలో సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో నిర్వహించిన మరగొళ్ల( కోడంగ్) పోటీలను(Maragolla competitions) ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పీవో రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ. ఆదివాసీ సమాజం తరతరాలుగా పాటిస్తూ వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో విశిష్టమైనవని తెలిపారు. పొలాల అమావాస్య పండుగకు నెల రోజుల ముందుగానే ఆదివాసీ గ్రామాల్లో (కోడింగ్) మరగొళ్లతో సరదాగా ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేసే సంప్రదాయం కొనసాగుతుందని చెప్పారు.
పొలాల అమావాస్య మరుసటి రోజు గ్రామ పొలిమేరల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఆదివాసీ సమాజంలో అనాదిగా వస్తున్న ఆచారమని పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై, తమ జీవన విధానంలో భాగంగా కొనసాగిస్తున్న ఇలాంటి సంప్రదాయాలు ఆదివాసీ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నాయని అన్నారు.
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, భాషలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పీవో తెలిపారు. ఈ దిశగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ భాష, సంస్కృతి పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.
యువత, విద్యార్థులు తమ సాంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలని, వాటిని గౌరవిస్తూ భావితరాలకు అందించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. మరగొళ్ల పోటీల్లో పాల్గొన్న వెంకటేష్, లాల్ శావ్ , కొముర విటల్ పీవో అభినందించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక గిరి సిబ్బంది, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఏపీఓపివిటిజి ఆత్రం భాస్కర్, ఈఈ తానాజీ,డిప్యూటీ డిఇఓ గోడం చందన్,గిరిజన క్రీడల అధికారి కె పార్థసారథి అధికారులు, సిబ్బంది, ఆదివాసీ కళాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు.