బిఆర్ఎస్ లో జోష్ !
- శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న మల్లారెడ్డి
- కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసనలు
- భారీ సంఖ్యలో పాల్గొంటున్న కార్యకర్తలు
- హాజరవుతున్న మల్లారెడ్డి కుమారులు మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి
మేడ్చల్, సెప్టెంబర్ 6(విజయ క్రాంతి): మేడ్చల్ నియోజకవర్గంలో (Medchal Constituency) బి ఆర్ ఎస్ లో నూతనోత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బి ఆర్ ఎస్ చేపడుతున్న నిరసనలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి , ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మల్లారెడ్డి, ఆయన కుమారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రోజువారి నిరసన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొంటున్నారు.
జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో మొక్కుబడిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రం విజయవంతంగా జరుగుతున్నాయి. మొదటి రెండు రోజులు మల్లారెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని శ్రేణుల్లో జోష్ నింపారు. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి మేడ్చల్ లో, చిన్న కుమారుడు డాక్టర్ భద్రారెడ్డి ఘట్కేసర్ మండలంలో జరిగిన వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
మల్లారెడ్డి యాక్టివ్ మోడ్‌లోకి రావడంతో..
మల్లారెడ్డి యాక్టివ్ మోడ్ లోకి రావడంతో నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. మల్లారెడ్డి శ్రేణులను ఉత్తేజపరచడమే గాక, నిర్వహణ ఖర్చులకు కూడా వెనుకాడడం లేదు. మల్లారెడ్డి మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సర్ పై అవగాహన, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొనలేదు. ఆయన లేకుండానే అవగాహన సమావేశాలు జరిగాయి. మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, పార్టీ సైతం స్పందించకపోవడంతో ఒక దశలో పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ చివరకు రాజీ చర్చలు జరిగాయి. హరీష్ రావుతో జరిగిన చర్చల తర్వాత మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముంగిట..
మున్సిపల్ కార్పొరేషన్ ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయని తెలుస్తోంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో విస్తరించి ఉంది. కార్పొరేషన్ ఎన్నికల ముంగిట క్యాడర్లో జోష్ రావడం శుభసూచకమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ లో కంటే బి ఆర్ ఎస్ లో ఎక్కువ జోష్ కనిపిస్తోంది. అంతేగాక బి ఆర్ ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు స్పందన లభిస్తుంది. ప్రతిరోజు వివిధ అంశాల మీద నిరసనలు చేస్తున్నారు.
మూడవ తేదీన 22 ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చబడిన ప్రైవేట్ ఆస్తుల కోసం రైతు సదస్సులు నిర్వహించగా, ఇందులో బాధితులు కూడా పాల్గొన్నారు. ఆదివారం తాగునీరు, వీధి దీపాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్, భక్తి దవఖానాల సాధన కోసం ఆటో ర్యాలీలు నిర్వహించారు. నిరసన కార్యక్రమా ల ప్రజలను కూడా భాగస్వాములను చేస్తున్నారు.
కాంగ్రెస్ సమావేశాల్లో మల్లారెడ్డి జపం..
కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించిన ఆ పార్టీ నాయకులు మల్లారెడ్డి జపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించడం కంటే ఎక్కువ సమయం మల్లారెడ్డి జపానికి కేటాయిస్తున్నారు.
మల్లారెడ్డి ఏమి అభివృద్ధి చేశాడు, వ్యాపార అభివృద్ధి తప్ప అని విమర్శలు చేయడం ప్రతి సమావేశంలో పరిపాటిగా మారింది. మల్లారెడ్డి మాత్రం విమర్శలను పట్టించుకోకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఇలాగే వెళ్లి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. మూడు మున్సిపాలిటీలలో రెండు బి ఆర్ ఎస్ కైవసం చేసుకోగా, మరో మున్సిపాలిటీలో సత్తా చాటింది.






