కలెక్టరేట్లో ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు
బోధన్,(విజయక్రాంతి): ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను(Kaloji Jayanti Celebrations) బుధవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ భుజంగరావు(Additional Collector Bhujanga Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కాళోజీ నారాయణరావు తన రచనలు, కవితలు, సామాజిక ఉద్యమాల(Social movements) ద్వారా ప్రజల సమస్యలను, సామాజిక రుగ్మతలను సమాజం దృష్టికి తీసుకువచ్చారని కొనియాడారు. తెలంగాణ ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. కాళోజీ రచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని, ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించే తత్వాన్ని ఆయన నుంచి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘన నివాళులు అర్పించారు.