కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం, సెప్టెంబర్ 27(విజయ క్రాంతి): స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ramagundam Police Commissioner Amber Kishore Jha) అన్నారు. ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం తన ఇల్లు, ఆస్తులను సైతం అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.
1915 సెప్టెంబర్ 27న ప్రస్తుత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) వాంకిడి గ్రామంలో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 1952లో ఆసిఫాబాద్ నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం భువనగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతిగా, మంత్రిగా ఆయన అందించిన సేవలను సీపీ స్మరించుకున్నారు.
1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇందిరాపార్క్, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సత్యాగ్రహాలు నిర్వహించారని తెలిపారు. ఆయన పోరాట పటిమ, త్యాగం, నిబద్ధత భవిష్యత్ తరాలకు ఆదర్శమని అన్నారు. దేశ, ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, ప్రత్యేక విభాగం ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఆర్ఐ మల్లేశం, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.