వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
శాంతియుతంగా శోభాయాత్రలు నిర్వహించాలి
కలెక్టర్ బి. సత్యప్రసాద్,ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల,సెప్టెంబర్ 19(విజయక్రాంతి): వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satyaprasad) అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24 తేదీల్లో కోరుట్ల పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జన వేడుకల ఏర్పాట్లను శనివారం ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.పట్టణంలోని వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో శోభాయాత్రలను నిర్వహిస్తూ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
నిమజ్జన ప్రాంతంలో స్టేజ్, విద్యుత్ దీపాలు, వైద్య సేవలు, అగ్నిమాపక సిబ్బంది,మత్స్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలుతీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు భారీ, చిన్న క్రేన్లు, గజ ఈతగాళ్లను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలని సూచించారు.
వినాయక నిమజ్జనానికి పట్టణ ప్రజలు, భక్తులు, పిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని భక్తులకు, నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.