ఎల్లంపల్లి ముంపు గ్రామాల భూములను కాపాడాలి

11-09-2026 | 05:08pm

- అధికారులు స్పందించాలని యువకుల ధర్నా

హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) హాజీపూర్ మండలం గుడిపేటలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన గుడిపేట, నంనూరు గ్రామాలకు నిర్వాసితుల కోసం ఆర్ అండ్ ఆర్ కాలనీలో కేటాయించిన ప్లాట్లలో మిగులు భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని, వాటిని కాపాడాలంటూ డిమాండ్ చేస్తూ శుక్రవారం యువకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపులో సర్వస్వం కోల్పోయిన బాధితుల పిల్లలు మాట్లాడారు.

ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు సమయంలో గుడిపేట, నమ్నూర్ గ్రామస్తుల సౌకర్యార్థం గుడికి, బడికి, పార్కు, అంగన్ వాడీ తదితర ఇతరత్ర అవసరాల కోసం కేటాయించిన భూములను కొందరు కబ్జాకోరులు అమ్ముడు పోయే అధికారులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించుకుని ఇతరులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్లాట్ల పక్కన గల భూములు అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమార్కుల పాలవుతున్నాయని, వాటిని రెవెన్యూ అధికారులు కాపాడాలని యువకులు కోరారు.

ఈ విషయంపై గతంలో పలు మార్లు తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేదని, అధికారులు నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వ స్థలాల (ప్లాట్ల)ను కబ్జా చేసి అమ్మకుంటున్నారని దుయ్యబట్టారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కబ్జాకు గురైన ప్లాట్లను వారి చెర నుంచి విడిపించి, వారి పేరిట రెవెన్యూ అధికారులు చేసిన అక్రమ పట్టాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు