ఏకత్వానికి ప్రతీకగా లింగారెడ్డిగూడెం..
* 50 ఏళ్లుగా ఒకే గణపతి
* ఒకే మండపం
షాద్నగర్, సెప్టెంబర్21 (విజయక్రాంతి): రాజకీయ విభేదాలు(Political differences), వర్గ భేదాలు(Class differences) పక్కనబెట్టి పండుగలను కలిసిమెలిసి జరుపుకోవడం నేటి రోజుల్లో అరుదుగా మారుతోం ది. గ్రామాల్లో పదుల సంఖ్యలో, పట్టణాల్లో వందల సంఖ్యలో వినాయక మండపాలు వెలుస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఫరూక్నగర్ మండలం(Farooqnagar Mandal) లింగారెడ్డిగూడెం గ్రామం(Lingareddigudem Village) మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా (50 ఏళ్లుగా) గ్రామంలో ‘ఒకే గణపతి.. ఒకే మండపం‘ అనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామస్తులు ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నారు.
తరాలు మారినా వీడని ఆనవాయితీ..
శ్రీ రామలింగేశ్వర స్వామి భజన మండలి(Sri Ramalingeswara Swamy Bhajana Mandali) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. భజన మండలి వ్యవ స్థాపకులు చల్ల సుదర్శన్ రెడ్డి(Challa Sudarshan Reddy), చల్ల పెద్ద వెంకటేశ్వర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు భీష్మ కిష్టయ్య(Former MLA Bhishma Kishtaiah), బక్కని నరసింహులు, చల్ల నరసింహారెడ్డి, మాజీ ఎంపిపి చల్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరుల నుంచి నేటితరం నాయకులు, గ్రామ పెద్దలు, యువకుల వరకు అందరూ భాగస్వాములవుతూ ఈ ఆనవాయితీని ముందుకు తీసుకెళ్తున్నారు.
పార్టీలు, కులమతాలకు అతీతంగాఅందరి గణపతి....
వివిధ రాజకీయ పార్టీలు(Political parties), భిన్న వర్గాలకు చెందిన ప్రజలున్నప్పటికీ.. వినాయక చవితి వేదికపై మాత్రం అందరూ ఒక్కటవుతున్నారు. ‘అందరి గణపతి.. అందరి పండుగ‘ అనే భావనతో చిన్నా, పెద్దా తేడా లేకుండా పందిరి కింద చేరి పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లింగారెడ్డిగూడెం చూపిస్తున్న ఈ సోదరభావం, సామరస్యం పట్ల షాద్నగర్ నియోజకవర్గ మేధావులు, విద్యావంతులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల ప్రత్యేక పాత్ర....
ఈ ఉత్సవాల్లో గ్రామ మహిళల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిరోజు మండపం ముందు ఆవు పేడతో అలకడం, రంగురంగుల ముగ్గులు వేయడమే కాకుం డా.. బతుకమ్మలు ఆడటం, కోలాటాలు, అన్నదాన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతున్నారు.అత్యంత వైభవంగా, ఐక్యమత్యంగా వేడుకలు నిర్వహిస్తున్న లింగారెడ్డిగూడెం గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.