భారత పొదిలో సరికొత్త స్పిన్ ఆయుధం
టెస్టుల్లో అదరగొడుతున్న మానవ్ సుతార్
ఆరంగేట్రం నుంచీ సంచలనాలే
గాలే టెస్టులో పలు రికార్డులు బ్రేక్
జడేజా వారసుడిగా ప్రశంసలు
గాలే , ఆగస్టు 19: టీమిండియా అంటేనే స్పిన్నర్లకు కేరాఫ్ అడ్రస్. బిషన్ సింగ్ బేడి, అనిల్ కుంబ్లే , హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు రిటైర్మెంట్ తర్వాత ఎవరో ఒకరు స్పిన్ విభాగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇపుడు జడేజా రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న వేళ మరో యువ సంచలనం భారత్ స్పిన్ పొదిలో చేరింది.
ఆ యువ స్పిన్నర్ ఎవరో కాదు మానవ్ సుతార్...మానవ్ సుతార్ ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన సరికొత్త స్పిన్ ఆయుధంగా దూసుకుపోతున్నాడు. కేవలం తన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనే అద్భుతమైన రికార్డులతో అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. జూన్ 2026లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన తన అరంగేట్రం టెస్టులోనే తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.
భారత క్రికెట్ చరిత్రలో నరేంద్ర హిర్వాణీ తర్వాత, ఆడిన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనూ 6 వికెట్ల హాల్ (ఇన్నింగ్స్‌లో) సాధించిన రెండో భారతీయ బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. రాజస్థాన్‌కు చెందిన 24 ఏళ్ల మానవ్ సుతార్, అద్భుతమైన ఫ్లైట్, డిప్ మరియు ఖచ్చితత్వంతో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా లోయర్-ఆర్డరర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా అతనికి ఉంది.
తాజాగా శ్రీలంకలోని గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ మొత్తం 10 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 4/76, రెండో ఇన్నింగ్స్‌లో 6/55) పడగొట్టి భారత్‌కు 165 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. గాలే వేదికగా 10/131 అత్యుత్తమ గణాంకాలతో విదేశీ గడ్డపై అతి పిన్న వయసులో 10 వికెట్లు తీసిన భారతీయ స్పిన్నర్‌గా హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించాడు. గాలే టెస్టులో ఏకంగా 74% డెలివరీలను 4.5 డిగ్రీల కంటే ఎక్కువ టర్న్ చేసి, సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లను సైతం వెనక్కి నెట్టాడు. భవిష్యత్తులో రవీంద్ర జడేజాకు సరైన వారసుడిగా జట్టులో స్థిరపడేందుకు అన్ని అర్హతలూ చూపిస్తున్నాడని కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం ప్రశంసించాడు.






