మెగా వైద్య శిబిరంలో 152 మందికి పరీక్షలు

05-10-2026 | 08:44pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల శ్రీనివాస్‌ టాకీస్‌ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో సోమవారం మెగా వైద్య శిబిరం(Mega Medical Camp) నిర్వహించారు. 58వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొట్ల అనిత సత్యం నేతృత్వంలో జరిగిన శిబిరాన్ని అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుధాకర్‌ నాయక్‌ ప్రారంభించారు. శిబిరంలో 152 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ నాయక్‌ మాట్లాడుతూ... వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్‌ అధికారులు, కౌన్సిలర్ల సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు పరీక్షలు, చికిత్సలు, రక్త పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం వంటి అసంక్రమణ వ్యాధులను గుర్తించి తక్షణ చికిత్స అందించారు. దిశా కార్యక్రమంలో భాగంగా ఎన్‌జీవోల సహకారంతో పరీక్షలు నిర్వహించారు. ఆర్‌బీఎస్‌కే వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్‌, అల్లాడి శ్రీనివాస్‌, నాందేవ్‌ శ్రీనివాస్‌, పుట్ట సత్తయ్య, అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ తబియా, ఆర్‌బీఎస్‌కే వైద్యులు డాక్టర్‌ రాము, డాక్టర్‌ రజిత, క్షయవ్యాధి నియంత్రణ సిబ్బంది, హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ దిశా సిబ్బంది, ఎన్‌జీవోలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు