10K రన్లో పాల్గొన్న తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ సభ్యులు
కొత్తపల్లి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం రోజు ఉదయం 5:30 గంటలకు నిర్వహించిన కరీంనగర్ మారథాన్(Karimnagar Marathon) విజయవంతంగా జరిగింది. ఈ మారథాన్‌లో సుమారు 5,000 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా 5 సంవత్సరాల చిన్నారుల నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు 3కె, 5కె, 10కె, 21కె విభాగాల్లో పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు.
మారథాన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ, పోలీసు శాఖ, ఎన్ సి సి, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ మారథాన్‌లో తెలంగాణ శ్రీనివాస సేవా సంస్థ (టీ ఎస్ ఎస్ ఎస్)కు చెందిన 25 మంది సభ్యులు 10కె రన్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. 10కె మారథాన్‌ను పూర్తి చేసిన సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఈ.వి. వేణుగోపాల్ టీ ఎస్ ఎస్ ఎస్ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మారథాన్ నిర్వాహకులు తెల్లవారుజామున 5 గంటలకే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. మార్గమధ్యంలో పాల్గొనేవారికి అలసట తెలియకుండా ఉత్సాహభరితమైన పాటలతో పాటు పండ్లు, మంచినీరు అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు.
పాల్గొనేవారి సౌకర్యార్థం ఫొటోల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వారి ఫొటోలు అందుబాటులోకి వచ్చేలా సాంకేతిక సదుపాయం కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. మారథాన్ అనంతరం రుచికరమైన అల్పాహారం ఏర్పాటు చేయడం కూడా ఎంతో బాగుందని వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి, పైడ శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, మంచికట్ల శ్రీనివాస్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.