నీరు వృథా అవుతున్నా పట్టించుకోరా?

03-10-2026 | 01:00pm

తాడ్వాయి,అక్టోబర్,03(విజయ క్రాంతి): ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నాం,తాగునీటి సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం అని పదే పదే చెబుతున్న అధికారులు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో విఫలమవుతున్నారు.క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతూనే ఉన్నాయి.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో గత వారం రోజుల నుంచి పైప్ లైన్‎కు ఏర్పడిన లీకేజీల కారణంగా మిషన్ భగీరథ నీళ్లు వృధాగా పోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చందాపూర్ లో ఉన్న మిషన్ భగీరథ పంప్ హౌస్ నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయని గ్రామ సర్పంచ్ మంగారెడ్డి ఆరోపించారు.పైపులైన్ల లీకేజీ కారణంగా నీళ్లు వృధాగా పోతున్నాయని,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.

వారం రోజుల నుంచి లీకేజీ

వారం రోజుల నుంచి మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న పైప్ లైన్ నుంచి నీళ్లు లీకేజీ అయి వృధాగా పోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.అయినా ఎవరు పట్టించుకోకపోవడం లేదు.లీకేజీ అయిన ప్రాంతం ప్రధాన రోడ్డు పక్కనే ఉన్నందున ప్రతిరోజు ఈ రోడ్డు గుండా సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు తిరుగుతూనే ఉంటారు.అయినా లీకేజీ అయిన నీటిని గుర్తించకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పైపులైనుకు ఏర్పడిన లీకేజీతో వేలాది లీటర్ల తాగు నీరు వృధాగా పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రధాన పైప్ లైన్ కు ఏర్పడిన లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

నిర్లక్ష్యంగా మిషన్ భగీరథ అధికారులు

ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ప్రజలకు తాగునీటిని అందించాల్సిన మిషన్ భగీరథ ఇంట్రా ఏ ఈ, గ్రిడ్ ఏలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.వారు మండలంలోని గ్రామాలను ఎప్పుడు సందర్శిస్తున్నారో, గ్రామాలకు ఎప్పుడు వస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సరఫరా లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు