వెయ్యి రోజుల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
ఉట్నూర్, సెప్టెంబర్ 05( విజయక్రాంతి ): ఉట్నూర్: కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐబీ చౌరస్తా, అంగడి బజార్, పాత బస్టాండ్ మీదుగా ఐటీడీఏ, వయా అంబేద్కర్ కూడలికి చేరుకుంది.
ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు ‘కాంగ్రెస్ పార్టీ జిందాబాద్’, ‘బొజ్జన్న నాయకత్వం వర్ధిల్లాలి’ ‘ప్రజల పట్ల బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ (KCR) రాజీనామా చేయాలి’ అనే నినాదాలతో ఉట్నూర్ ప్రధాన కూడళ్లు కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో హోరెత్తాయి.
అనంతరం కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించామని, రూ.2 లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు, మహిళా శక్తి ద్వారా ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, విద్యార్థులకు నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆదివాసీ, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ వెయ్యి రోజుల్లో, గత 10 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఒక్కరోజు అసెంబ్లీకి రాకుండా ప్రజల పట్ల, రాష్ట్రంపై బాధ్యత లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. వెంటనే కేసీఆర్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పదేళ్లలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉండి దళిత ముఖ్యమంత్రిని చేస్తామని మాట తప్పారని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, జనరల్ సెక్రటరీ ఇక్బాల్, ఆర్టీఏ సభ్యులు దూట రాజేశ్వర్, మార్సుకోల తిరుపతి, ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ నిసార్, లాజర్, యూత్ కాంగ్రెస్ నాయకులు అరకిల్ల పరమేశ్వర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మహేందర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కొద్దు పటేల్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, అన్సారీ, అజీమ్, దేవానందం, కళీమ్, షెరీఫ్, గోడిపల్లి భీమన్న, ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.






