6 September, 2026 | 1:07 PM

మున్సిపల్ కౌన్సిలర్లు వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండాలి

06-09-2026 | 11:13am

పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందాలి

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షాద్‌నగర్ ఎమ్మెల్యే(Shadnagar MLA), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ(Distribution of smart ration cards) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడి, రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.

ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాల విషయంలో అర్హత ఉన్న ఏ ఒక్క పేద కుటుంబం కూడా నష్టపోకుండా చూడాలని కోరారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, ఎమ్మార్వో నాగయ్య.మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, 28 మంది వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సుజీవన్ లబ్ధిదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు