మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలి
30 రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య...
ఆలేరు, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు 30 రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించాలని కోరారు. రక్తదాన, వైద్య శిబిరాలు, మొక్కలు నాటడం, స్వచ్ఛత కార్యక్రమాలు, అన్నదానం, చిత్రలేఖనం, వ్యాసరచన, కెరీర్ కౌన్సెలింగ్, డిజిటల్ అక్షరాస్యత, నీటి సంరక్షణ, రహదారి భద్రత తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘నా కలలోని భారత్’ పేరుతో విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
అర్హులైన వారికి పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్టోబర్ 7న ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పాశం భాస్కర్, జగన్మోహన్ రెడ్డి, కందూరి అచ్చయ్య, తునికి దశరథ తదితరులు పాల్గొన్నారు.