భూముల రీ- సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

08-09-2026 | 02:12pm

కల్వకుర్తి సెప్టెంబర్ 8: భూముల రీ సర్వే(Land Re-survey) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి వివరాల నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు.

భూ భారతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కల్వకుర్తి  మండలం బెక్కెర గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి, అధికారులు, సర్వేయర్లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గ్రామ పరిధిలోని రెవెన్యూ భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన రీ సర్వే వివరాలపై అధికారులతో చర్చించారు. సర్వే ప్రక్రియకు సంబంధించి గ్రామంలోని రైతులకు ముందస్తుగా సమాచారం అందించారా? లేదా? అనే అంశంపై ఆరా తీశారు. రైతులకు పూర్తి సమాచారం అందిస్తూ, వారి సమక్షంలో భూముల హద్దులు, వివరాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

భూముల రీ సర్వే అత్యంత కీలకమైన ప్రక్రియ అని, భవిష్యత్తులో భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి భూమికి సంబంధించిన హద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, ఏడి సర్వేయర్ గిరిధర్, కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీం, ఆర్ఐ కార్తీక్ రెడ్డి, సర్వేయర్లు, సంబంధిత రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు