ఓటర్ల జాబితా ప్రక్షాళనపై నారాయణ ఘాటు విమర్శలు

21-09-2026 | 05:09pm

హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఎన్నికల సంఘం చేపడుతున్న చర్యలు ప్రజల ప్రాథమిక ఓటు హక్కును పరిరక్షించేలా లేవని సీపీఐ సీనియర్ నేత నారాయణ(Senior leader Narayana) విమర్శించారు. ‘సర్’ ప్రక్రియ పేరుతో ఈసీ వ్యవహరిస్తున్న తీరు విజ్ఞతకు విరుద్ధంగా ఉందని, ఓటర్లను అవమానించేలా ఉందని ఆయన ఆరోపించారు. ‘ఎద్దు ఈనిందంటే దూడను గాట్లో కట్టేయమన్నట్లుగా’ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని నారాయణ ఎద్దేవా చేశారు. ఓటర్ల వివరాల్లో సాంకేతిక లోపాలు లేదా తప్పులు ఉంటే క్షేత్రస్థాయిలోనే వాటిని సరిదిద్దాలని సూచించారు. అయితే మాజీ ఉపప్రధాని ఎల్‌.కె. అద్వానీ, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ వంటి ప్రముఖులకు సైతం నోటీసులు జారీ చేయడం ఏ రకమైన ప్రక్షాళన అని ప్రశ్నించారు.

పేర్లలో స్వల్ప స్పెల్లింగ్‌ తప్పులు, వివాహం తర్వాత మహిళల ఇంటిపేర్లు మారడం వంటి సహజమైన మార్పులను కూడా సమస్యలుగా పరిగణించడం సరికాదని నారాయణ అన్నారు. తాతముత్తాతల పుట్టిన తేదీల వంటి వివరాలను సేకరించాల్సిందిగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కోట్లాది మంది ఓటర్ల హక్కుల పరిరక్షణ విషయంలో ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకత, రాజ్యాంగబద్ధమైన నిష్పక్షపాతంతో వ్యవహరించాలని నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని కార్యాలయం నడిపించే ‘సురభి నాటకం’లో స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ పావుగా మారకూడదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.



మరిన్ని వార్తలు