రోడ్డుపై నవజాత శిశువు.. నిందితులను గుర్తించిన పోలీసులు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్(Mahabubnagar)లో రోడ్డుపై నవజాత శిశువును వదిలివెళ్లిన ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ జానకి(District SP Janaki) ఆదేశాల మేరకు, పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సీఐ ఎజాజుద్దీన్ నేతృత్వంలో ఎస్‌ఐ శివ నాగేశ్వర్ నాయుడు, హెచ్‌సీ శేఖర్, కానిస్టేబుళ్లు అశోక్, కూరమూర్తి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 5న మహబూబ్‌నగర్‌లోని కేఎఫ్‌సీ సమీపంలో రోడ్డుపై నవజాత శిశువును వదిలివెళ్లిన ఘటనపై సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శిశువును వదిలిన వారిని గుర్తించి కేసు నమోదు చేశారు.
మైనర్ బాలికను ఆనంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె గర్భం దాల్చినట్లు పోలీసులు తెలిపారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టగా, సెప్టెంబర్ 4న కడుపునొప్పి రావడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించినట్లు వెల్లడించారు. అనంతరం శిశువును రోడ్డుపై వదిలివేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఎస్‌ఐ శివ నాగేశ్వర్ నాయుడు, ఏఎస్‌ఐ దేవి, హెచ్‌సీ శేఖర్, కానిస్టేబుళ్లు అశోక్, కూరమూర్తి తదితరుల సేవలను జిల్లా ఎస్పీ అభినందించారు. మైనర్ బాలికలు ప్రేమ పేరుతో మోసపోవద్దని, ఇలాంటి ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జానకి సూచించారు.