పామాయిల్ గెలల అక్రమ తరలింపు కేసులో 9 మంది అరెస్ట్
2 ఆటోలు, పామాయిల్ గెలలు, నగదు స్వాధీనం
దమ్మపేట, అక్టోబర్ 03(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(Bhadradri Kothagudem District SP Rohit Raju), ఐపీఎస్ ఆదేశాల మేరకు, దమ్మపేట పోలీసులు(Dammapeta Police) పామాయిల్ గెలలను(Oil palm bunches) అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ముఠాపై చర్యలు చేపట్టి 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దమ్మపేట పోలీస్ స్టేషన్(Dammapeta Police Station) పరిధిలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా పామాయిల్ గెలలను ఫ్యాక్టరీలకు తరలించే సమయంలో, యజమానులకు తెలియకుండా కొంత మొత్తంలో పామాయిల్ గెలలను మార్గమధ్యంలో దించి అక్రమంగా తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
గత నాలుగు నెలలుగా బుగ్గపాడు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బత్తిన రాము, ట్రాక్టర్ డ్రైవర్లు గడ్డం మహేంద్ర, కీసరి నాగరాజు, నాగబాబు తదితరులు వివిధ గ్రామాల నుంచి పామాయిల్ గెలలను అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలకు తరలించే సమయంలో కొంత భాగాన్ని మార్గమధ్యంలో దించి, యజమానులకు తెలియకుండా అక్రమంగా తరలించి విక్రయించినట్లు విచారణలో తేలింది. అదేవిధంగా, కనితి లక్ష్మీనారాయణ అక్రమంగా సేకరించిన పామాయిల్ గెలలను కనితి శివ, వంక చందు తమ ఆటోల ద్వారా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి తరలించడంలో సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పొట్ట ముత్యాలరావుతో పాటు మరికొందరికి కూడా సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే జక్కా బాలు, కారం వెంకటేష్, చి. పుల్లారావు తమ ఎఫ్ కోడ్ లను ఉపయోగించి పామాయిల్ గెలల విక్రయాలకు సహకరించడంతో పాటు, వాటి ద్వారా జరిగిన నగదు లావాదేవీల్లో భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పరస్పరం సమన్వయంతో పామాయిల్ గెలలను అక్రమంగా తరలించి, విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, 2 ఆటోలు, పామాయిల్ గెలలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పామాయిల్ గెలలను అక్రమంగా తరలించడం, దొంగతనం చేయడం, కోడ్ లను దుర్వినియోగం చేయడం లేదా ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు సహకరించడం చట్టపరంగా నేరమని పోలీసులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ దర్యాప్తులో అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు, దమ్మపేట ఎస్ఐ బాలస్వామి, దమ్మపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.