హెల్త్ పోర్టల్‌లో OpenAI కలకలం.. ఆస్ట్రేలియా అలర్ట్!

24-09-2026 | 07:51am

ఆస్ట్రేలియా ప్రభుత్వ హెల్త్ పోర్టల్‌లోకి OpenAI ఏజెంట్

కాన్‌బెర్రా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) రంగంలో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. జూన్‌లో OpenAIకి చెందిన AI ఏజెంట్ ఆస్ట్రేలియా ప్రభుత్వ మెడికేర్ గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్(Anthony Albanese) వెల్లడించారు. న్యూయార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ సంచలన విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న Medicare Statistics Reporting Service పోర్టల్‌లోకి AI ఏజెంట్ అనధికారంగా ప్రవేశించి పబ్లిక్‌తో పాటు కొన్ని నాన్-పబ్లిక్ ఫైళ్లను యాక్సెస్ చేసినట్లు ప్రధాని తెలిపారు. ఆరోగ్య, వైద్య గణాంకాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.

వ్యక్తిగత డేటా యాక్సెస్ కాలేదు

ఈ ఘటనపై ప్రభుత్వం ఫోరెన్సిక్ దర్యాప్తు(Forensic investigation) కొనసాగిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎవరికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం యాక్సెస్ అయినట్లు ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. పోర్టల్‌లో ఉన్న సమాచారం ప్రధానంగా సమగ్ర ఆరోగ్య, మెడికేర్ గణాంకాలకు సంబంధించినదేనని పేర్కొన్నారు. సిస్టమ్‌కు నష్టం వాటిల్లినట్లు కూడా ప్రస్తుతం ఆధారాలు లేవని తెలిపారు. అయితే ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి AI ఏజెంట్ అనధికారికంగా ప్రవేశించడం తీవ్రంగా పరిగణిస్తున్నామని అల్బనీస్ తెలిపారు. ఈ ఘటన భవిష్యత్తులో AI వ్యవస్థల భద్రత, పర్యవేక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు. 

సామ్ ఆల్ట్‌మన్‌తో ప్రధాని చర్చ

ఈ ఘటనపై OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్‌తో తాను మాట్లాడినట్లు ఆస్ట్రేలియా ప్రధాని(Prime Minister of Australia) తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వెబ్‌సైట్‌లోకి ప్రవేశించిన ఘటనపై తన ఆందోళనను ఆయనకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం, OpenAI కలిసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పనిచేస్తున్నాయి.


మరిన్ని వార్తలు