7 September, 2026 | 6:09 AM

రహదారి కబ్జాలతో పార్కింగ్ కష్టాలు..!

07-09-2026 | 04:05am

పెంచికల్పేట్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎల్కపల్లి గ్రామ ప్రధాన చౌరస్తాలో రహదారికి ఇరువైపులా ఉండాల్సిన ఖాళీ స్థలాలు ఆక్రమణల(Encroachments)కు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వాహనాల పార్కింగ్కు స్థలం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం కావడంతో చుట్టుప క్కల గ్రామాల నుంచి నిత్యం ప్రజలు బ్యాం కులు, వ్యాపార సముదాయాలు, గ్రామపంచాయతీ కార్యాలయం, ఇతర అవసరాల కోసం పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

అయితే వా హనాలు నిలిపేందుకు ప్రత్యేక స్థలం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన రహదారిపైనే వాహనాలను నిలపాల్సి వస్తోంది. ఇదే అదునుగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనల పేరుతో వాహనదారులకు చలాన్లు విధిస్తున్నా రని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా చలాన్లు విధించడం ఎంతవరకు సమంజసమని వాహన దారులు ప్రశ్నిస్తున్నారు. వా హనాలను ఎక్కడ నిలపాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రహదారికి ఇరువైపులా ఉండాల్సిన ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా వాటిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు అధికారుల దృష్టికి రావడం లేదా? వస్తే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.సామాన్య ప్రజలు పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే, సమస్యకు పరిష్కారం చూపకుండా చలాన్లతో మరింత భారం మోపడం సరికాదని స్థానికులు అంటున్నారు.

తక్షణమే ప్రధాన చౌరస్తాలో రహదారికి ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాలను అధికారులు పరిశీలించి, ఆక్రమణలను తొలగించి, వాహనాల పార్కింగ్కు అనువైన స్థలాన్ని క్రమబద్ధీకరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముందుగా పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపాలి.. ఆ తర్వాతే నిబంధనల పేరుతో చలాన్లు విధించాలని వాహనదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు