14 July, 2026 | 8:25 PM

రూ.9 లక్షల పీడీఎస్ బియ్యం పట్టివేత

14-07-2026 08:23 PM

- గౌరారంలో 294.50 క్వింటాళ్ల సన్నబియ్యం స్వాధీనం

గజ్వేల్: గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు రూ.9 లక్షల విలువైన 294.50 క్వింటాళ్ల అనుమానిత పీడీఎస్ సన్నబియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్‌ఐ జె. ఆరోగ్యం సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ 39 టీఎచ్ 8653 అశోక్ లేలాండ్ లారీని తనిఖీ చేయగా, ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్స్ (ఎఫ్‌ఆర్‌కే) కలిసిన పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఏసీఎస్ఓ సాయిరవి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. లారీ డ్రైవర్ దీపక్ పున్ విచారణలో, హైదరాబాద్‌లోని తుక్కుగూడ సమీపంలోని గుర్తుతెలియని గోదాం నుంచి లారీ యజమాని తవిటి యోగేష్ రాజన్ ఆదేశాల మేరకు బియ్యాన్ని లోడ్ చేసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపాడు. సరుకుకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్, ఈ-వే బిల్ తదితర చట్టబద్ధ పత్రాలు ఏవీ చూపించలేకపోయాడు.

దీంతో మొత్తం 590 బస్తాల్లో 29,450 కిలోల (294.50 క్వింటాళ్లు) బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మర్కూక్ మండలం నర్సన్నపేటలోని శ్రీ రామాంజనేయ అగ్రో ఇండస్ట్రీస్ గోదాముకు తరలించి భద్రపరిచారు. ప్రాథమిక విచారణలో ఈ బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందినదిగా గుర్తించామని, అత్యావసర వస్తువుల చట్టం–1955, తెలంగాణ పీడీఎస్ (కంట్రోల్) ఆర్డర్–2016 నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు తెలిపారు.