రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్
ప్రజాసమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం
కేసీఆర్ నివాసానికి హరీశ్‌రావు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
జవహర్‌నగర్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని, సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా అంటూ ప్రశ్నించారు. పాలనలో వెయ్యి రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు.
మంగళవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్తుండగా హకీంపేట్ వద్ద హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నివాసంపై దాడికి కుట్ర జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ పరిణామాలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశమంతా రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్‌గాంధీకి తెలంగాణలో అప్రజాస్వామిక చర్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాగా హరీశ్‌రావును జవహర్‌నగర్ పీఎస్‌కు తరలించడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.