రామగుండం కమిషనరేట్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్(Ramagundam Police Commissionerate) కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ మొక్కను అందజేసి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Amber Kishore Jha)కు స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతంతో పాటు రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ ను ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులు, సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలందరికీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన చారిత్రక దినమని అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతం భారత యూనియన్లో విలీనమై సమగ్ర భారతదేశంలో అంతర్భాగంగా మారిన చారిత్రక పరిణామాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ పరిణామం కోసం నాడు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసిన వారిని గౌరవంగా స్మరించుకోవాలని అన్నారు.
దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కోసం ప్రజలు ఐక్యంగా పనిచేసేలా ప్రోత్సహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడం, వారి భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను మరింత పటిష్టంగా పరిరక్షించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి భద్రత, సంక్షేమం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.