వృత్తి పరమైన అభివృద్ధి సదస్సులు వైద్య నిపుణుల జ్ఞానాన్ని పెంపొందిస్తాయి
అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఘట్ కేసర్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిరంతర వృత్తి పరమైన అభివృద్ధి సదస్సులు వైద్య నిపుణుల జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, రోగ నిర్ధారణ సామర్థ్యాలను బలోపేతం చేసి, మెరుగైన రోగి సేవలు అందించేందుకు దోహదపడతాయని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Dr. Palla Rajeshwar Reddy) అన్నారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజిస్ట్స్ అండ్ మైక్రోబయాలజిస్ట్స్ తెలంగాణ రాష్ట్ర శాఖ 9వ వార్షిక సదస్సు ఘట్కేసర్ సర్కిల్, వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ(Anurag University)కి చెందిన నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించారు. నిమ్స్ పాథాలజీ విభాగం ఆధ్వర్యంలో “మోర్ఫాలజీ నుంచి మాలిక్యులర్ పరిజ్ఞానం వైపు వారధి అనే ఇతివృత్తంతో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ఈసదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ పాథాలజీ నిపుణులు, అధ్యాపకులు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, కన్సల్టెంట్ పాథాలజిస్టులు పాల్గొన్నారు. మొత్తం 485 మంది ప్రతినిధులు నమోదు చేసుకుని సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో నిరంతరం సిపిడి కార్యక్రమాలను నిర్వహిస్తూ అధ్యాపకులు అకాడమిక్, వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు సంస్థ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. సదస్సులో భాగంగా ప్రముఖ వైద్య నిపుణులు కీలక ప్రసంగాలు అందించారు.