జూరాల వద్ద బీజేపీ నాయకుల అరెస్టుపై నిరసన

22-09-2026 | 03:28pm

రైతుల ఆందోళనకు మద్దతుగా వెళ్లిన నేతలను అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం

వనపర్తి , సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): జూరాల ప్రాజెక్టు (Jurala Project)ఎడమ కాలువ వద్ద సాగునీటి కోసం రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లిన బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచంద్రరావు పిలుపు, మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సూచనల మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి జూరాల ప్రాజెక్టు వద్దకు వెళ్లినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారని నాయకులు ఆరోపించారు. దీనిపై నిరసనగా నర్వ మండల బీజేపీ అధ్యక్షుడు అజిత్‌ సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్‌రామ్, బీజేవైఎం నాయకుడు మీసాల అశోక్‌గౌడ్, లంకాల బూత్‌ అధ్యక్షుడు అయ్యప్పస్వామి తదితరులు జూరాల వద్దకు చేరుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, అన్నదాతల పక్షాన తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు