మోసంతో రెడ్ క్రాస్ ఎన్నికల్లో గెలుపు
సేవ చేయని వారికి పదవులు ఎందుకు
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు డాక్టర్ ఎన్ బాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో(Kamareddy District) శనివారం జరిగిన రెడ్ క్రాస్ ఎన్నికల్లో(Red Cross Election) మోసం చేసి పదవులను పొందడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే సుమారుగా 10 లక్షల రూపాయల రెడ్ క్రాస్ డబ్బులు వృధా అవుతాయని,ఆ డబ్బును సమాజం కోసం ఖర్చు చేయాలనే మంచి ఉద్దేశంతో పదిమంది సభ్యులు నామినేషన్లను ఉపసంహరించడం జరిగిందని,చైర్మన్ గా అవకాశం కల్పించమని ముక్కెర సంజీవరెడ్డి (పిట్లం) అభ్యర్థించడంతో ఏకగ్రీవం కావడానికి అవకాశం ఇస్తే,వైస్ చైర్మన్ పదవికి అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసి, అందుబాటులో ఉండని వ్యక్తులకు,ప్రభుత్వ ఉద్యోగులకు, స్థానికేతరులకు రెడ్ క్రాస్ జిల్లా పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఏ రోజు కూడా రక్తదానం చేయని వారు, రక్తదానం(Blood Donation) చేయడానికి అర్హత లేని వారు,ఆపదలో ఉన్నవారికి సహాయం చేయని వారికి పదవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం డబ్బున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు(Government Jobs) ఉన్నవారికి సేవ చేయని వారికి ఉన్నత పదవులు ఇచ్చి సమాజానికి అన్యాయం చేయడం జరిగిందని అన్నారు.పని చేయని వారికి పదవులు ఇచ్చి సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు.
రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అని సమాజానికి నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తులు,ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందజేసే వ్యక్తులు ఉంటే సంస్థకు ఉన్న గౌరవం పెరుగుతుందే తప్ప పదవులు పొంది ఏ రోజు కూడా సహాయం చేయకుండా ఉండే వారికి పదవుల వలన ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండని ప్రభుత్వ ఉద్యోగులకు వైస్ చైర్మన్,ట్రెజరర్ పోస్టులు ఇవ్వడం వలన ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగదని బాలు అన్నారు.