రైస్‌మిల్లర్లు మాకు ప్రత్యర్థులు కాదు
- ప్రజాధనాన్ని విస్మరించలేం
- వాస్తవ మొత్తాన్ని రాబట్టడమే మా ఉద్దేశం
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : రైస్ మిల్లర్ల(Rice millers)ను ప్రభుత్వం ప్రత్యర్థులుగా కాకుండా కీలక భాగస్వాములుగా చూస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. ఈ అంశానికి రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. రైస్ మిల్లర్లు సమ్మెకు దిగిన నేపథ్యంలో పరిష్కారం కోసం అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రివర్గ ఉపసంఘం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పెనాల్టీలు, టెండర్ ధాన్యం ధరలు(Grain prices), స్టాక్ వ్యత్యాసాలు, సరఫరా గడువు పొడిగింపు, ఇతర ఇబ్బందులను మిల్లర్ల ప్రతినిధులు మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మిల్లర్ల వినతులను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని, ప్రభుత్వ పరిధి లో ఏమి చేయగలమో ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. మిల్లర్లపై అనవసరమైన భారం మోపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.
అదే సమ యంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చేసిన వాస్తవ వ్యయాన్ని, ప్రజా ధనాన్ని విస్మరించలేమని పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నదని, ఆ నిధులతో రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తున్నామని వివరించారు.
రైతులకు చెల్లించిన కనీస మద్దతు ధరతోపాటు బ్యాంకులకు చెల్లిస్తున్న వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉం టుందని చెప్పారు. ఖర్చు చేసిన వాస్తవ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడమే తమ ఉద్దేశమని.. అంతకు మించి మిల్లర్లపై భారం వేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. పెనాల్టీలు, పెండింగ్ సరఫరాలు, స్టాక్ వ్యత్యాసాలు, వడ్డీ భారంతో సహా అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, నిబంధనలకు లోబడి సాధ్యమైన పరిష్కారం కనుగొంటామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థపై వడ్డీ భారం పెరిగిన విషయాన్ని కూడా మిల్లర్లు అర్థం చేసుకోవాలని కోరారు.
మిల్లర్ల ప్రతినిధులతో మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి రావాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్, అదనపు డైరెక్టర్ రోహిత్ పాల్గొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున తూడి దేవేందర్‌రెడ్డి, గంప నాగేందర్, గణపతిరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.