సీఎం చర్చకు పిలవాలి.. లేదంటే బంద్ కొనసాగిస్తాం...!
విజిలెన్స్ దాడులు నిలిపివేయాలి.. బకాయిలు తక్షణమే చెల్లించాలి
డిమాండ్లు పరిష్కరించే వరకు మిల్లులు తెరిచేది లేదు
విలేకరుల సమావేశంలో బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్లు
బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించి ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలకు పిలవాలని బాన్సువాడ డివిజన్ రైస్ మిల్లర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని తిరుమల రైస్ మిల్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు నాగులగామ వెంకన్న మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలను వెంటనే చెల్లించాలని, ట్రాన్స్పోర్ట్ చార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెంటనే చర్చకు పిలవాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్ దాడులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు.
మా ప్రధాన ఆరు డిమాండ్లతో పాటు సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలి. కేవలం హామీలతో సరిపెట్టకుండా బకాయిలు చెల్లించి, విజిలెన్స్ దాడులపై నిర్ణయం తీసుకోవాలి. డిమాండ్లు పరిష్కరించే వరకు బంద్‌ను విరమించేది లేదు.. మిల్లులు తెరిచేది లేదు” అని మిల్లర్లు స్పష్టం చేశారు.సీఎం చర్చకు పిలిచి సమస్యలను పరిష్కరించే వరకు రైస్ మిల్లుల బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో బాన్సువాడలో రైస్ మిల్లర్లు బంద్ పాటిస్తూ నిరసన చేపట్టారు.తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే బంద్‌ను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్డీవో రవీందర్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.