చినుకు పడితే చెరువులే!
మట్టి మాఫియా వాహనాల రాకపోకలే కారణమా..?
శామీర్ పేట్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): మూడు చింతలపల్లి మున్సిపాలిటీ(Muduchintalapalli Municipality) పరిధిలోని లక్ష్మపూర్ తాండ నుండి కొట్యలకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు మున్సిపాలిటీ కి 2 కిలోమీటర్ల దూరం, పక్కనే జినోమ్ వ్యాలీ పేస్ 3 కి 2 కిలోమీటర్ల దూరం మాత్రమే అయినా రోడ్డును పట్టించుకునేవారే కరువైయ్యారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లపై నీరు నిలిచి చెరువులను తలపిస్తున్న పరిస్థితి నెలకొంటోంది.
గుంతల్లో నీరు చేరడంతో రోడ్డు ఎక్కడుందో, గుంత ఎక్కడుందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా భారీ మట్టి వాహనాల రాకపోకల కారణంగానే రోడ్లు దెబ్బతిన్నాయా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలించే వాహనాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్లకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మట్టి తరలింపు వాహనాల రాకపోకలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ప్రమాదకరంగా మారిన గుంతల రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.