దీదీకి ‘సంచిత’ షాక్
- ఉప ఎన్నిక నామినేషన్ విత్ డ్రా
- మమతాబెనర్జీ.. రెబెల్స్ గ్రూప్‌లకు
- పార్టీ పేర్లు, గుర్తులు ఖరారు చేసిన ఈసీ
- కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన మమతా బెనర్జీ
కోల్‌కతా, సెప్టెంబర్ 18: పశ్చిమ బెంగాల్(West Bengal)లో ఓ వైపు టీఎంసీలో అంతర్గత కలహాలతో పార్టీ పేరు, గుర్తును కోల్పోయే ప్రమాదంలో ఉండగా, మరోవైపు ఉప ఎన్నిక(By-election)ల్లో మమతా బెనర్జీ(Mamata Banerjee) పార్టీ తరఫున బరిలోకి దిగిన మహిళా అభ్యర్థి సంచిత ప్రధాన్ దేయ్(Sanchita Pradhan Dey) నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో మమతకు షాక్ తగిలింది. దీంతో మమతా బెనర్జీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక మమతా బెనర్జీ ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(All India Trinamool Congress) (ఏఐటీసీ)’ పార్టీ అని, ఫుట్‌బాల్ ప్లేయర్ గుర్తును కేటాయించారని, అదే సమయంలో తిరుగుబాటు గ్రూప్ అరూప్ రాయ్ ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్(Democratic Trinamool Congress) (డీటీసీ)’ అని, వీరికి ఎన్వెలప్ గుర్తును కేటాయించినట్లు శుక్రవారం ఈసీ వెల్లడించింది.
టీఎంసీ పార్టీలో రెబెల్స్ గ్రూప్ ఉద్భవించాక పార్టీ పేరు, గుర్తుపై ఇరువర్గాల నేతలు పార్టీ తమదంటే తమదేనని, గుర్తూ తమదేనని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్‌లోని రెండు స్థానాలకు (నందిగ్రామ్, రెజీనగర్) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఎంసీ, టీఎంసీ రెబెల్స్ ఇరువురు అదే పార్టీ పేరుతో, గుర్తుతో అభ్యర్థులను రంగంలోకి దింపారు. దీనిపై ఇరుపార్టీలను ఈసీ సంప్రదించి ఈ నెల 18 వరకు నిర్ణయించుకునేందుకు తుదిగడువిచ్చింది.
నిర్ణయించుకోకపోతే తామే అదే రోజు ఇరువురికి పార్టీ పేరు, గుర్తులను ప్రకటిస్తామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈసీ ప్రకటన వెలువడింది. టీఎంసీకి 28మంది ఎంపీలుండగా, వారిలో 20 మంది ఫిరాయించారు. అసెంబ్లీలో 80 సంఖ్యాబలం ఉండగా, వీరిలో 58 మంది వేర్వేరు గ్రూపులుగా ఏర్పడ్డారు. ప్రస్తుతం మమత పార్టీలో 22 మంది మాత్రమే ఎమ్మెల్యేలు మిగిలారు.
కాగా మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి మహిళా అభ్యర్థిని రంగంలోకి దించగా, ఆమె శుక్రవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణకు ముందు సంచితా పశ్చిమ బెంగాల్ సీఎం సువెందు అధికారిని కలవడం కొసమెరుపు. దీంతో మమతా బెనర్జీకి చుక్కెదురైనట్లయ్యింది.