మహిళలకు సంకెళ్లు
అనాగరిక ఆచారాలు
నాగరికత పరుగులు కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, సాంకేతికత అంబరాన్ని దాటి అంతరిక్షానికి ఎగబాకుతున్న ఈ తరుణంలోనూ ప్రపంచంలోని కొన్ని మూలల్లో మహిళల ఉనికి ప్రశ్నార్థకంగానే ఉందంటేఅతిశయోక్తి కాదు. ఆచారాలు, సంప్రదాయాలనే ముసుగులో మహిళల అణచివేత కొనసాగుతున్నది. వారి అందం సమాజాన్ని పాడు చేస్తుందనే అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి.
అది ఏ స్థాయిలో ఉంటుందంటే, ఆ కారణంతో యువతలు, మహిళల అవయవాలను ఛిద్రం చేసేంత దారుణంగా ఉంటుంది. ఆఫ్రికా అడవుల నుంచి ఆసియా తీరాల వరకు విస్తరించి ఉన్న భూభాగంలో ఇప్పటికీ అనాగరిక ఆచారాలు అమలులో ఉన్నాయి. ముఖ్యంగా కామెరూన్, నైజీరియా వంటి దేశాల్లో ‘బ్రెస్ట్ ఐరనింగ్’ అనే భయంకరమైన ఆచారం కొనసాగుతున్నది.
ఈ ఆచారం అక్కడి ఆడపిల్లలకు శాపం. ఇంతకీ ఆ ఆచారం ఏమిటంటే.. ఆడపిల్లల్లో శారీరక మార్పులు కనిపిస్తే వారిపై పురుషుల దృష్టి పడుతుందని, దీంతో సమాజంలో అత్యాచారాలు లేదా అవాంఛిత గర్భాలు వస్తాయని అక్కడి తల్లులు భయపడతారు. అందుకే.. పెద్ద పెద్ద మొద్దుల కాలే కాష్టంలో కాపిన రాళ్లతో, సుత్తులతో యువతుల రొమ్ములను అదిమేస్తారు.
ఈ దారుణం తర్వాత సదరు యువతులు కొన్నినెలల పాటు నొప్పితో చిత్రవధ అనుభవిస్తారు. అంతేకాదు.. కొన్నేళ్ల తర్వాత బాధితుల్లో ఎక్కువ మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. మరికొందరు ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్నారు. ఇంకొందరు పిల్లలకు పాలిచ్చే సామర్థ్యం కోల్పోతున్నారు. అనాగిరక ఆచారం బారిన పడిన ౧౦౦ మంది యువతుల్లో, 58 శాతం బాధితులు తమ తల్లుల ఒత్తిడితోనే ఆచారానికి బలి అవుతున్నారు.
‘కయాన్’ ఆచారం
మయన్మార్, థాయ్‌ల్యాండ్ సరిహద్దుల్లో ఉండే ’కయాన్’ తెగ మహిళల మెడలు చూడటానికి చాలా పొడవుగా, ఆశ్చర్యకరంగా కనిపిస్తాయి. ఆ మెడ పొడవు వెనుక దశాబ్దాల నొప్పి దాగి ఉంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఆడపిల్లల మెడ చుట్టూ, వారి తల్లిదండ్రులు ఇత్తడి రింగులు అమర్చుతారు. ఏళ్లు గడిచేకొద్దీ వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. క్రమంగా ఆ రింగులు ఆడిపిల్లల భుజాల ఎముకలను కిందికి నొక్కివేస్తాయి.
ఒక్కసారి ఆ రింగులు తీసేస్తే, మెడ కండరాలు తల బరువును మోయలేక విరిగిపోయేంత బలహీనమవుతుతాయి. మారిటానియా అనే దేశంలో ‘లావుగా ఉండటమే అందం’ అనే నమ్మకం ఉంది. ఆ దేశంలో ధనిక వర్గాలకు చెందిన అమ్మాయి పెళ్లి కావాలంటే, ఆమె స్థూలకాయురాలై ఉండాలి. తల్లిదండ్రులు అందుకు కూతుళ్లను ‘లెబ్లోహ్’ అనే శిబిరాలకు పంపిస్తారు. నిర్వాహకులు అక్కడ రోజుకు 16,000 కేలరీల ఆహారాన్ని అమ్మాయిలకు బలవంతంగా తినిపిస్తారు.
అరిష్టం పేరిట కొన్ని
భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళను గౌరవించాల్సింది పోయి, మునుపటి కంటే ఎక్కువ ఆదరించాల్సింది పోయి ఆమెను అరిష్టంగా భావించే ఆచారాలు అమలవున్నాయి. ఆఫ్రికాలోని కొన్ని తెగల్లో ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతున్నది. భర్త మరణానికి ఆమెనే బాధ్యురాలిని చేస్తూ, ఇంటి నుంచి వెళ్లగొట్టడం లేదా ఆస్తి హక్కులు నిరాకరించడం అక్కడ పరిపాటి. దీనివల్ల ఎంతోమంది మహిళలు దిక్కుతోచక బలవన్మరణాలకు పాల్ప డుతున్నారు.
సంప్రదాయం, ఆచారం పేరుతో మహిళల ప్రాణాలతో, శరీరాలతో ఆడుకునే ఏ ఆచారమైనా అది నేరమే. చట్టాలు ఎన్ని ఉన్నా, సామాజిక చైతన్యం రానంత వరకు ఇలాంటి మానవహక్కులు హరించే సంప్రదాయాలు ఎన్నితరాలైనా కొనసాగుతూనే ఉం టాయి. ప్రతి మహిళకు తన శరీరంపై తనకు పూర్తి హక్కు ఉండాలి. విద్యావంతులైన సమా జం ఈ అనాచారాలపై గొంతు ఎత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది.-
పసుపులేటి వెంకటేశ్వరరావు, 88857 97981
మరో క్రూరమైన ఆచారం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైన మరో క్రూరమైన ఆచారం ‘స్త్రీ జననాంగ విచ్ఛేదనం’. ఈ ఆచారం ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అమలులో ఉంది. స్త్రీ పవిత్రతను కాపాడటం కోసం అనాగరిక పద్ధతిలో ఈ ప్రాక్టీస్ అమలవుతున్నది. ఆ పనిచేసే వారు ఆడపిల్లలకు ఎలాంటి మత్తు మందు లేకుండా, అపరిశుభ్రమైన బ్లేడ్లు లేదా కత్తులతో జననాంగ విచ్ఛేదనం చేస్తారు.
కొన్నిసార్లు ఈ ప్రక్రియలో తీవ్ర రక్తస్రావమై ఆడపిల్లలు చనిపోతారు. ఈ ప్రాక్టీస్ కేవలం బాధితులకు తగిన శారీరక గాయం మాత్రమే కాదు, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య. వివాహ యోగ్యత పేరుతో వారి లైంగిక హక్కులను, భావాలను తుంచివేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి దీనిని మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనగా ప్రకటించినా, రహస్యంగా ఈ ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది.
మానవ హక్కుల గురించి ప్రపంచం ఊదరగొడుతున్నా, 21వ శతాబ్దంలోనూ నాగరిక సమాజం తలదించుకోవాల్సిన చేదు నిజం ‘స్త్రీ జననాంగ విచ్ఛేదనం’. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని, ఆరోగ్యాన్ని నిలువునా దహించే ఒక సామాజిక మహమ్మారి. తాజాగా వెల్లడైన గణాంకాలు చూస్తుంటే, ఈ రాక్షసత్వం తగ్గకపోగా మరింత విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఎనిమిదేళ్ల క్రితం నాటి గణాంకాలతో పోలిస్తే, ప్రస్తుతం ఈ అమానవీయ ఆచారానికి గురైన మహిళల సంఖ్య 15 శాతం పెరగడం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా నేడు 23 కోట్ల మందికి పైగా బాలికలు, మహిళలు ఈ వేదనను అనుభవిస్తున్నారు. గత ఎనిమిది ఏళ్లలోనే కొత్తగా 3 కోట్ల మంది ఈ జాబితాలో చేరారు. అత్యధికంగా 14.4 కోట్ల మంది బాధితులు ఆఫ్రికాలో ఉన్నారు.
ఆసియాలో సుమారు 8 కోట్ల మంది మహిళలు ఈ అనాచారానికి బలవుతున్నారు. మధ్యప్రాచ్యంలో 60 లక్షల మందికి పైగా ఈ క్రూరత్వానికి గురయ్యారు. వలసల కారణంగా ఈ ఆచారం ఇప్పుడు కేవలం ఆయా ఖండాలకే పరిమితం కాకుండా, ఐరోపా, అమెరికాలోని కొన్ని వర్గాల్లోనూ రహస్యంగా కొనసాగుతున్నది.




